Maharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..

Maharashtra: మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం ఉద్దవ్ థాక్రే సంచనల వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు బలపరీక్షకు ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. నమ్ముకున్న వాళ్లు, సొంత మనుషులే మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అందరూ కలిసి నన్ను నట్టేట ముంచారని ఉద్దవ్ థాక్రే వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఇప్పటివరకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. గత రెండున్నరేళ్లలో ఏమైనా తప్పులు చేసుంటే క్షమించాలని వేడుకున్నారు. గవర్నర్ తీరుపైనా సీఎం ఉద్దవ్ థాక్రే మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ ప్రతిపక్ష నేతగా మారిపోయారని ఆరోపించారు.
ఒక్కరోజులో అసెంబ్లీలో బలం నిరూపించకోమనడాన్ని ఆయన తప్పుబట్టారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. అయితే అనర్హత పిటిషన్‌పై జులై 11న సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని.. అప్పటి వరకు బలపరీక్ష నిర్వహించరాదన్నారు ఉద్దవ్ థాక్రే. మరోవైపు రేపటి బలపరీక్షపై గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది. శివసేన తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, షిండే వర్గం తరుపున కౌల్, మహారాష్ట్ర గవర్నర్ తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు.
ఫ్లోర్ టెస్టుకు సమయం కావాలని శివసేన కోర్టును కోరింది. ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కరోనాతో బాధపడుతున్నారని.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారని శివసేన తరుపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. ఈ సమయంలో బలపరీక్షకు సమయం కావాలని కోరారు. అయితే ఫ్లోర్ టెస్టుకు కనీస సమయం ఉందా? రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉన్నాయా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.
10వ షెడ్యూల్ ప్రకారం ఫ్లోర్ టెస్టు కుదరదని శివసేన తరపు న్యాయవాది సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బలపరీక్షకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఏ గవర్నర్ అయినా సీఎం సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అనర్హులైన ఎమ్మెల్యేలను బలపరీక్షలో పాల్గొనకుండా చూడాలని, అనర్హత వేటుకు గురైన వారు ఓటు వేయలేరని సింఘ్వీ సుప్రీంకోర్టును విన్నవించారు. అయితే దీనిపై జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులో.. అనర్హులో మీరెలా చెప్పగలరని జస్టిస్ సూర్యకాంత్.. సింఘ్వీ వాదనలు తోసిపుచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com