Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో పేలుడు.. శరీరాలు ముక్కలై ..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో జరిగిన ఓ కారు పేలుడు ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ భయానక ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. "నా కళ్ల ముందే శరీర భాగాలు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఒక చేయిని నేను చూశాను. ఆ పేలుడు శబ్దం ఎంత బలంగా ఉందంటే, నా చెవులు కాసేపటి వరకు పనిచేయలేదు. ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేను" అని తీవ్ర భయాందోళనతో తెలిపారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 బయట ఆగి ఉన్న వాహనంలో ఈ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, దుకాణాల కిటికీలు, తలుపులు కంపించాయని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఈ ప్రదేశం జామా మసీద్‌కు కేవలం 1.1 కిలోమీటర్ల దూరంలో, గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్‌కు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. పేలుడు తర్వాత మంటలు చెలరేగి మరికొన్ని కార్లకు కూడా వ్యాపించాయి.
"మా ఇంటి టెర్రస్ పైనుంచి పెద్ద మంటల గోళం కనిపించింది. ఏం జరిగిందోనని కంగారుగా కిందకు పరిగెత్తుకొచ్చాను," అని గురుద్వారా సమీపంలో నివసించే ఒక వ్యక్తి ఎన్డీటీవీకి చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ కార్లలో పేలుళ్లు జరిగాయని తాను భావిస్తున్నట్లు మరో వ్యక్తి తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, చుట్టుపక్కల ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. పాత ఢిల్లీలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. డజనుకు పైగా అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

