Karnataka CM : కర్ణాటక సీఎంపై కేసు నమోదు.. రాజీనామాపై కీలక వ్యాఖ్యలు

మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ ఈ కేసు నమోదుచేశారు. ముడా అక్రమాలపై విచారణ చేపట్టిన సంబంధిత కోర్టు.. 3 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల లోకాయుక్తను ఆదేశించిన క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
ఈ కేసులో ముఖ్యమంత్రి ఏ1, ఆయన సతీమణి పార్వతి ఏ2, బావమరిది మల్లికార్జున స్వామి ఏ3, భూములు విక్రయించిన దేవరాజు ఏ4, ఇతరులను ఏ5 నిందితులుగా పేర్కొన్నారు. సీఎంపై భూ ఆక్రమణల నియంత్రణ, అవినీతి నిరోధక, ఫోర్జరీ, బినామీ ఆస్తుల పరిరక్షణ, అధికార దుర్వినియోగం అభియోగాల కింద పలు సెక్షన్లు పెట్టారు.
తన రాజీనామా కోసం విపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై ఉదయం సిద్ధరామయ్య స్పందిస్తూ.. గోద్రా కేసులో ఆనాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ రాజీనామా చేశారా? అక్రమ గనుల తవ్వకాల కేసులో బెయిల్‌పై ఉన్న కేంద్రమంత్రి కుమారస్వామి నుంచి ప్రధాని రాజీనామా కోరారా? అంటూ ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, రాజీనామా చేయనని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com