CEA New Rules 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్.. కొత్త రూల్స్ ఇవే.

CEA New Rules 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్.. కొత్త రూల్స్ ఇవే.
X

CEA New Rules 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ పిల్లల చదువుల విషయంలో ఊరటనిచ్చే వార్త ఇది. పిల్లల విద్యా భత్యం (Children Education Allowance) విషయంలో కేంద్రం ఇటీవల కొన్ని కీలక మార్పులు చేస్తూ నిబంధనలను మరింత స్పష్టం చేసింది. పెరుగుతున్న విద్యా ఖర్చులకు అనుగుణంగా ఈ అలవెన్స్‌ను పెంచడమే కాకుండా, క్లెయిమ్ చేసుకునే పద్ధతిలోనూ వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసం పెట్టే ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. దీనినే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటారు. స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, స్పోర్ట్స్ సామాగ్రి వంటి వాటి కోసం ఈ నగదును వాడుకోవచ్చు. తాజా నిబంధనల ప్రకారం.. ఈ భత్యం క్లెయిమ్ చేయడం మరింత సులభతరం అయింది. గతంలో బిల్లులన్నీ దాచిపెట్టాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు స్కూల్ నుంచి ఒక చిన్న సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది.

ఎంత నగదు అందుతుంది?

2024 లో కరువు భత్యం పెరగడంతో, దానికి అనుగుణంగా CEA లో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రతి బిడ్డకు నెలకు రూ.2,812.5 చొప్పున విద్యా భత్యం అందుతుంది. అంటే సంవత్సరానికి ఒక బిడ్డకు దాదాపు రూ.33,750 ప్రభుత్వం ఇస్తుంది. ఇక హాస్టల్‌లో ఉండి చదువుకునే పిల్లల కోసం ఇచ్చే హాస్టల్ సబ్సిడీ నెలకు రూ.8,437.5 వరకు ఉంటుంది. మీరు ఎంత ఖర్చు చేశారు అనే దానితో సంబంధం లేకుండా ఈ నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఇది గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు వర్తిస్తుంది.

ఎవరెవరు అర్హులు?

ఈ పథకం కింద నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ పిల్లలకు 20 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా 12వ తరగతి పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ భత్యం ఇస్తారు. ఒకవేళ బిడ్డ దివ్యాంగుడైతే, ఈ వయోపరిమితిని 22 ఏళ్లకు పెంచారు. రెగ్యులర్ స్కూల్‌తో పాటు దూరవిద్య ద్వారా చదివే వారికి కూడా ఇది వర్తిస్తుంది. గుర్తింపు పొందిన CBSE, ICSE లేదా స్టేట్ బోర్డ్ పాఠశాలల్లో చదువుతుంటేనే ఈ వెసులుబాటు ఉంటుంది.

కొత్త విద్యా విధానం ఎఫెక్ట్

కేంద్రం మరో కీలక వివరణ ఇచ్చింది. కొత్త విద్యా విధానం (NEP 2020) అమలు వల్ల ఏదైనా తరగతిని మళ్ళీ చదవాల్సి వచ్చినా లేదా క్లాసుల మార్పులు జరిగినా, ఆ ఒక్క సంవత్సరానికి వన్-టైమ్ మినహాయింపుగా CEA పొందే అవకాశం కల్పించింది. ఒకవేళ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నా కూడా అతని పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా కొన్ని షరతులతో కూడిన భత్యం అందుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story