కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రప్రభుత్వం చర్యలు

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రప్రభుత్వం చర్యలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి టీకా అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అందించేందుకు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి టీకా అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అందించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలుచేపట్టింది. దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కోవిడ్ -19 టీకా అందరికి అందేలా అధికార యంత్రాంగం పూర్తి సన్నద్దతతో ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఎలా స్పందిస్తాయో....అలాగే సన్నద్దం కావాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితులు, టీకా అందజేతకు సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీకా వచ్చాక దానిని పంపిణీ చేయాల్సిన విధానం గురించి సూచనలు చేశారు. సువిశాల దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా అందేందుకు ఏం చేయాల్సి ఉంటుందో చర్చించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం నుంచి, టీకా వేయడానికి అవసరమైన సూదుల కొనుగోలు వరకు ప్రతి దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఒకవైపు వైరస్ కు కళ్లేం వేస్తూనే మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు సిద్దం కావాలని సూచించారు.

ఈ సంవత్సరం చివర,లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కరోనా టీకా అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టీకా పంపిణీ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో.. అవసరమైన స్థాయిలో సిరంజిలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టాయి. దీనిలో భాగంగా మనదేశంలో సిరంజి తయారీ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్‌ టీకా పంపిణీకి 0.5 ఎంఎల్‌ ఏడీ సిరంజిలు అవసరమవుతాయి. ఇవి కోట్లల్లో అవసరం కావడంతో వాటి ఉత్పత్తిపై దృష్టిసారించారు.

భారత్‌లో తొలి విడత టీకా పంపిణీకి దాదాపు 90 కోట్ల సిరంజిలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సిరంజి తయారీ రంగంలో 3 ఇండియన్‌ ఫర్మ్స్‌, హిందుస్థాన్‌ సిరంజెస్‌, ఇస్కాన్‌ అండ్‌ బెక్టాన్‌ డైకిన్‌సన్‌ అనే మూడు కంపెనీలు ప్రధానమైనవి. ఈ మూడూ కలిసి ప్రస్తుతానికి ఏడాదికి 110 కోట్ల సిరంజిలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని వచ్చే జూన్‌ నాటికి 140 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని ఈ మూడు కంపెనీలు కలిసి నిర్ణయించుకున్నాయి. ఇందులో 50 శాతం సిరంజిలను దేశీయ అవసరాలకు అం దించాలని, మిగిలిన వాటిని తమకున్న ఇతర ఆర్డర్లను అనుసరించి విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

కరోనా టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తోంది. టీకా పంపిణీకి సంబంధించి నీతీ ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తొలుత ఎవరికి ఇవ్వాలనే అంశమై ముసాయిదా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వైరస్‌ ముప్పు ఎక్కువ ఉన్నవారిని 4 విభాగాలుగా వర్గీకరించింది. ఈ ప్రకారం ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులున్న 30 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందనుంది. 60 కోట్ల డోస్‌లను ఒక్కొక్కరికి రెండు డోస్‌ల చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఈ నెలాఖరు లేదా నవంబరు నాటికి పూర్తి జాబితా సిద్దం చేయనున్నారు.

Tags

Next Story