Bihar : బిహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం

బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో వెల్లడించింది. బిహార్ కు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏమైనా ఉందా అని జేడీయూ ఎంపీ రామ్ ప్రీత్ మండల్ లోక్ సభలో ప్రశ్నించారు. అయితే, బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం బిహార్కు స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమిలో జేడీయూ కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఇటీవల ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెర పైకి తెచ్చింది. అదే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యం అని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే ఆ రాష్ట్ర అసెంబ్లీలో నితీశ్ కుమార్ సర్కార్ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. ఈ క్రమంలో బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పడం ఎన్డీఏలో కీలకంగా జేడీయూకు గట్టి షాక్ తగిలినట్లేనని చెప్పాలి. ఈ నిర్ణయంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com