Operation Sindoor: ఫ్రారంభమైన అఖిలపక్ష సమావేశం

ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్‌తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అన్ని పార్టీల నేతలు సమావేశం అయ్యారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామణ్, జై శంకర్, కిరణ్ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను రక్షణ మంత్రి పంచుకుంటున్నారు.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com