Central Government : ఎంపీల జీతాలు, అలవెన్సులను పెంచిన కేంద్రం

ఎంపీల జీతాలు, అలవెన్సులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24శాతం మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ.లక్ష నుంచిరూ.1.24లక్షలకు పెరగనుంది. దీనికితోడు సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం రూ.2 వేల నుంచి రూ. 2,500కు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే మాజీ ఎంపీలకూ పింఛన్లు రూ. 25 వేల నుంచి రూ. 31 వేలకు హైక్చేసింది. పెంచిన వేతనాలు, పింఛన్లు 2023 ఏప్రిల్ నుంచి వర్తించనున్న ట్లు కేంద్రం వెల్లడించింది.. 2018 సవరణ ప్రకారంగా, వేతనానికి అదనంగా ఎంపీలు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70వేలు పొందుతూ వస్తున్నారు. దాంతో పాటు నెలకు కార్యాలయ భత్యంగా రూ.60వేలు, పార్లమెంట్ సమావేశాల సమయంలో రోజువారీ భత్యంగా రూ.2వులు అందుకుంటున్నారు. తాజాగా అలవెన్సులు సైతం పెరగనున్నాయి. వీటితో పాటు ఎంపీలకు ఫోన్, ఇంటర్‌నెట్ కోసం వార్షిక భత్యం కేంద్రం చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, వృత్తిపరమైన, వ్యక్తిగత ఉపయోగం కోసం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం సైతం చేసేందుకు అవకాశం కల్పించింది. రోడ్డు మార్గం ద్వారా వెళితే అలవెన్స్ సైతం పొందొచ్చు. ఎంపీలు సంవత్సరానికి 50వేల యూనిట్ల ఉచిత విద్యుత్, నాలుగువేల కిలో లీటర్ల నీటిని పొందుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com