Jharkhand: నేడు జార్ఖండ్ లో బలపరీక్ష

జార్ఖండ్‌లో (Jharkhand) జేఎంఎం నేత చంపయీ సొరేన్ (Champai Soren) నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలపరీక్షను ఎదుర్కోనున్నది. బలపరీక్ష నెగ్గడం అధికార కూటమికి అంత సులువుగా కనిపించడం లేదు. బలపరీక్ష జరుగనున్న 24 గంటల ముందు జేఎంఎం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీకి, మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు (Hemant Soren) వ్యతిరేకంగా గళం విప్పడం.. మరో ఎమ్మెల్యే టచ్‌లో లేకుండా పోవడం సంకీర్ణ ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
81 స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 41 కంటే ఎక్కువగానే తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ఆ సంఖ్య 46-47 వరకు చేరుకొంటుందని సీఎం చంపయీ సొరేన్‌తో సహా అధికార పక్ష నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కూటమిలోని ఎమ్మెల్యేలు అందరూ సోమవారం జరిగే బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే సరే.. లేకుంటే సర్కార్ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్‌కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.
జార్ఖండ్‌లో జెఎంఎం ఎమ్మెల్యేల్లో అసమ్మతి స్వరం చల్లారింది. తాను చంపాయ్ ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ఇస్తానని, బలపరీక్షలో సానుకూల ఓటేస్తానని జెఎంఎం ఎమ్మెల్యే లోబిన్ హెమ్‌బ్రూమ్ ఆదివారం ప్రకటించారు. నాయకత్వ తీరు సరిగ్గా లేదని తొలుత ప్రకటించడంతో సోమవారం నాటి విశ్వాసపరీక్ష దశలో ఏమి జరుగుతుందో అనే అనుమానాలు తలెత్తాయి. అయితే జెఎంఎం అధినేత షిబూ సోరెన్‌తో లోబిన్ సమావేశం తరువాత ప్రకటన వెలువరించారు. షరతులతో కూడిన మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రజలకు సంబంధించి కీలక విషయాలపై తాను సోరెన్ వద్ద ప్రస్తావించానని, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని దీనితో తన మద్దతు హామీ ఇచ్చానని ఈ ఎమ్మెల్యే వివరించారు. దీనితో సోమవారం నాటి బలపరీక్షలో జెఎంఎం సంకీర్ణ సర్కారు నెగ్గేందుకు మార్గం తేలిక అయిందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com