Chandrababu: మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి..

Chandrababu: మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి..
Chandrababu: ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుల కలయికపై ఢిల్లీలో విస్తృత చర్చ జరుగుతోంది.

Chandrababu: ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుల కలయికపై ఢిల్లీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమం వేదికగా… సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్నారు మోడీ, చంద్రబాబు. వీరి మాట మంతిపై ఇటు రాజకీయ పక్షాల్లోనూ, అటు జాతీయ మీడియాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా రోజుల తరువాత కలిసిన మోడీ, చంద్రబాబు.. ఆత్మీయ పలకరింపులతో పాటు దేశ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రధాని మోడీ టీడీపీ అధినేతతో చర్చించినట్లు సమాచారం.

ప్రధాని బిజీ షెడ్యూల్‌ ఉండి కూడా చంద్రబాబు నాయుడిని పక్కకు తీసుకెళ్లి మాట్లడటంతో పాటు మరోసారి ఢిల్లీ రావాలని కోరడాన్ని బట్టి చంద్రబాబు ప్రాధాన్యత, సీనియర్‌ పొలిటీషియన్‌గా చంద్రబాబు అనుభవాన్ని ప్రధాని మోడీ మరోసారి గుర్తించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం.. చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు చర్చలు జరిపారు. ఆయన ఆరోగ్యం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక.. ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదని ప్రధాని మోదీ.. చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని ప్రధాని మోదీ అన్నారు. చాలా రోజులుగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నట్లు ఆయనకు బదులిచ్చారు చంద్రబాబు. అయితే.. మళ్లీ ఢిల్లీ టూర్‌కు ఆహ్వానం పంపిస్తానని ప్రధాని మోదీ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులు, అనేక మంది జాతీయ స్థాయి నాయకులను కలుసుకున్నారు. వారితో అనేక విషయాలను చర్చించుకున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులను చంద్రబాబు కలిశారు. ఇదే భేటీలో పాల్గొన్న సినీనటుడు రజనీకాంత్‌, పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు.అంతకుముందు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

దాదాపు 20 నిమిషాలకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. మరోసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.ఆ పర్యటనలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. నలబై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతల అవసరం ఎంతైనా ఉందని బీజేపీలోని కొందరు నేతలు కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story