Chardham Yatra: నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర షురూ..!

చార్‌ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు గంగామాత్ర డోలి బయలుదేరింది. బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరుతుంది. ఉదయం 10.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరుస్తారు. యమునోత్రి ధామ్‌కు యమున మాతా పల్లకీ ఉదయం 8.30 గంటలకు చేరుకోనున్నది. 11.55 గంటలకు ఆలయ తలుపులు తెరువనున్నారు. చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు బుధవారం తెరుచుకోనుండగా.. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు ఆలయాలను మూసివేసే విషయం తెలిసిందే. వేసవి నేపథ్యంలో తెరుచుకోనున్నాయి. చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేఠ్ సమీక్షించారు. రిషికేశ్‌కు చేరుకున్న ఆయన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సారి చార్‌ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నట్లు తెలిపారు. గతేడాది చార్‌ధామ్ యాత్రలో 48లక్షల మంది పాల్గొన్నారు. ఇప్పటికే చార్‌ధామ్ యాత్రకు పర్యాటకుల నుంచి స్పందన వస్తున్నది. పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనేందుకు పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com