Chidambaram : జమిలి ఎన్నికలు అసాధ్యం : చిదంబరం

భారత్‌లో జమిలి ఎన్నికలు జరపడం అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన చిదంబరం.. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమన్నారు. రాజ్యాంగ సవరణలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే సర్కారు వద్ద తగిన సంఖ్యాబలం లేదని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అనే విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. కాగా, గతనెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com