China Foreign Minister : ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన చైనా విదేశాంగ మంత్రి

భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు దిశగా కీలక ముందడుగు పడింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వివాదాస్పద అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన వాంగ్ యీ, తన పర్యటనలో భాగంగా ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-చైనా సరిహద్దు సమస్యపై 24వ విడత ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చల్లో సరిహద్దు వాణిజ్యం, నదీ జలాల సమాచార మార్పిడి, కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలు, యాత్రికులకు సౌకర్యాలు వంటి పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రేర్ ఎర్త్స్, ఎరువులు, టన్నెల్-బోరింగ్ యంత్రాలకు సంబంధించి భారత్ వ్యక్తం చేసిన మూడు ప్రధాన ఆందోళనలపై సానుకూలంగా స్పందిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని వాంగ్ యీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, "రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకూడదు, అలాగే పోటీతత్వం సంఘర్షణకు దారితీయకూడదు," అని స్పష్టం చేశారు. ఈ పర్యటన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో వాంగ్ యీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com