G-20 Summit: సమ్మిట్ కు జిన్ పింగ్ డుమ్మా
భారత్‌లో మరో పది రోజుల్లో జరగనున్న జీ20 సమ్మిట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ భేటీకి హాజరు కావట్లేదు. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్‌కు రానున్నారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో అంతర్భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.అరుణాచల్ ప్రదేశ్ ను, అక్సాయ్ చిన్ ను తమ దేశంలో భాగంగా చైనా చూపించుకుంది. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ సదస్సుకు రాకపోవటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది ఎందుకంటే సదస్సుకు జిన్ పింగ్ హాజరు అవుతారని గతంలో చైనా ప్రకటించింది. ఇప్పుడు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తమదేశంలో విలీనం చేసుకున్నట్లు చైనా ఇటీవలే అధికారిక మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది. దీనిపై జీ20లో ప్రస్తావించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జిన్‌పింగ్ హాజరు కాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవన్నీ ఎలా ఉన్నా ఎలాంటి అవ్వాంచనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com