CJI: కాసేపట్లో సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియగా.. నేడు సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ సూర్యకాంత్ సుప్రీంకోర్టు సీజేఐ పదవిలో ఉండనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు సూర్యకాంత్. హిసార్ జిల్లాకోర్టులోనే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై.. అక్కడి నుంచి సుప్రీంకోర్టు సీజేఐగా పదోన్నతి పొందారు.
కీలక తీర్పులిచ్చిన సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ వృత్తిపరంగా అనేక ముఖ్యమైన తీర్పులిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుని సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. అలగా వలసపాలకుల కాలం నాటి దేశద్రోహ చట్టం (సెక్షన్ 124A) వినియోగాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల బెంచ్ లోనూ ఉన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసు, ఎన్నికల పారదర్శకత, లింగ సమానత్వం, పీఎం సెక్యూరిటీ బ్రీచ్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. తీర్పులు ఇచ్చిన ధర్మాసనాలు, బెంచ్ లలో సూర్యకాంత్ ఒకరిగా ఉన్నారు. సీజేఐ గా ఆయన మరిన్ని చరిత్రాత్మక తీర్పులు ఇస్తారని, కీలక సంస్కరణలు చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.
స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే
ఎవరైనా న్యాయమూర్తి తాను స్వతంత్రుడనని నిరూపించుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించక తప్పదని, కోర్టు ముందున్న ఆధారాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం అవసరమని చెప్పారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ గవాయ్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక న్యాయమూర్తిగా తమ ఎదుట ఉన్నది ప్రభుత్వమా, ప్రైవేటు వ్యక్తులా అన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనే భావన కొందరిలో ఉంది. అది సరికాదు. స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తి అని నిరూపించుకునేందుకు ప్రభుత్వం చేసే ప్రతిదానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని గవాయ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

