Toll Tax Rules 2026 : ఇక నుంచి టోల్ బాకీ ఉంటే బండి కదలదు..ఆర్టీఓ సేవలకు కేంద్రం కొత్త బ్రేకులు.

Toll Tax Rules 2026 : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై నేషనల్ హైవేలపై టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడదామనుకుంటే కుదరదు. మీ కారు లేదా బైక్ మీద ఒక్క రూపాయి టోల్ బకాయి ఉన్నా, ఆర్టీఓ ఆఫీసులో మీ పని అస్సలు జరగదు. ఈ మేరకు కేంద్రం మోటార్ వాహనాల నిబంధనలు-2026లో భారీ మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ పనిచేయకపోయినా లేదా ఏదైనా కారణంతో డబ్బులు కట్ అవ్వకపోయినా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం. కానీ ఇకపై అటువంటి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు-2026ను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. వాహనంపై ఏదైనా టోల్ బకాయి ఉంటే, ఆ వాహనానికి సంబంధించిన కీలకమైన సర్కారీ పనులు ఏవీ పూర్తి కావు.
ముఖ్యంగా మీ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా లేదా వేరే వ్యక్తికి అమ్మాలన్నా కావాల్సిన ఎన్ఓసీ జారీ చేయరు. అలాగే, కమర్షియల్ వాహనాలకు అత్యంత కీలకమైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ ప్రక్రియను నిలిపివేస్తారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలకు ఇచ్చే నేషనల్ పర్మిట్‌లను కూడా టోల్ బకాయిలు క్లియర్ చేసే వరకు నిలిపివేసేలా నిబంధనలను కఠినతరం చేశారు. టోల్ వసూళ్లలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం బకాయి ఉన్న టోల్‌కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా ప్లాజా దాటితే, అది బకాయిగానే పరిగణించబడుతుంది. ఇప్పుడు మనం ఎన్ఓసీ కోసం అప్లై చేసే ఫామ్-28లో కూడా మన బండి మీద ఎలాంటి టోల్ బకాయిలు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్ కావడంతో, సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ బండి నంబర్ ద్వారా బకాయిలను గుర్తించేస్తుంది.
భవిష్యత్తులో నేషనల్ హైవేలపై ఎక్కడా గేట్లు లేదా బారియర్లు లేకుండా ప్రయాణించే మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో(MLFF) సిస్టమ్‌ను తీసుకురావాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ పద్ధతిలో కారు ఆపకుండానే వెళ్ళవచ్చు, కానీ టోల్ మాత్రం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఒకవేళ కట్ అవ్వకపోతే, పైన చెప్పిన విధంగా ఆర్టీఓ ఆఫీసులో మీ పనులు నిలిచిపోతాయి. అందుకే వాహనదారులు ఎప్పటికప్పుడు తమ టోల్ బకాయిలను తనిఖీ చేసుకుని చెల్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
