Maharashtra BRS: ఆలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఉత్సాహంలో మరాఠీలు

మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయాన్నే షోలాపూర్ నుంచి పండరీపూర్ చేరుకున్న కేసీఆర్.. శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. ఆలయ ఉత్తరద్వారం గుండా కేసీఆర్ తదితరులు లోపలికి వెళ్లారు. కేసీఆర్ దుకాణ సముదాయాల నడుమ నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు కేసీఆర్‌కు శ్రీవిట్టల్ రుక్మణీ ప్రతిమను బహూకరించాడు. సీఎం వెంట పలువురు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
సీఎం ఆలయానికి వెళ్లిన సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ప్రత్యేక పూజల అనంతరం సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు భారీ స్థాయిలో పండరీపురం చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com