Wayanad : అమిత్‌షా ప్రకటన ఖండించిన సీఎం విజయన్.. వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించలేదు

విపత్తు గురించి రాష్ట్రాన్ని కొన్ని రోజుల ముందే హెచ్చరించామని కేంద్రమంత్రి అమిత్ షా ( Amit Shah ) చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Vijayan ) ఖండించారు. తమకు ఎలాంటి అలర్ట్ ను జారీ చేయలేదని స్పష్టం చేశారు.
నిందలకు ఇది సమయం కాదని చెప్పారు.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీశారని.. 191 మంది ఆచూకీ గుర్తించలేదని తెలిపారు. 5,500 మందిని రక్షించినట్లు వెల్లడించారు. 8 వేల మందికి పైగా బాధితులను 82 శిబిరాలకు తరలించినట్లు వివరించారు.
"విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి" అని సీఎం విజయన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com