Coimbatore : భార్యను చంపి మృతదేహంతో భర్త సెల్ఫీ

తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె నివసిస్తున్న మహిళల హాస్టల్‌లోకి ప్రవేశించి కత్తితో పొడిచి చంపాడు. అంతటితో ఆగకుండా, ఆమె మృతదేహంతో సెల్ఫీ దిగి, "మోసానికి శిక్ష మరణం... నమ్మకద్రోహానికి బదులు తీర్చుకున్నా" అనే క్యాప్షన్‌తో వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టాడు. ఈ దారుణ ఘటన కోయంబత్తూరులోని గాంధీపురం సమీపంలో శనివారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, తిరునల్వేలికి చెందిన ఎస్. బాలమురుగన్ (32), శ్రీప్రియ (30) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా శ్రీప్రియ నాలుగు నెలల క్రితం భర్తను, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చింది. ఇక్కడి రాజా నాయుడు రోడ్డులోని ఓ మహిళల హాస్టల్‌లో ఉంటూ, బ్యాగుల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో భర్త దూరపు బంధువైన ఇసాక్కి రాజాతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న బాలమురుగన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. శనివారం కోయంబత్తూరుకు వచ్చి, ఆ సంబంధాన్ని వదులుకుని తనతో తిరిగి రావాలని శ్రీప్రియను కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. అదే సమయంలో, ఇసాక్కి రాజా... శ్రీప్రియతో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోను బాలమురుగన్‌కు పంపాడు. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది.
మద్యం మత్తులో హాస్టల్‌కు చేరుకున్న బాలమురుగన్, శ్రీప్రియతో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. శ్రీప్రియ రక్తపు మడుగులో పడి ఉండగా, ఆమె శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రత్నపురి పోలీసులు, మృతదేహం పక్కనే కూర్చుని ఉన్న బాలమురుగన్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

