Coldrif Syrup: కోల్డ్‌రిఫ్ సిరప్‌తో 11 మంది చిన్నారులు మృతి.. డాక్టర్ అరెస్ట్..

Coldrif Syrup: కోల్డ్‌రిఫ్ సిరప్‌తో 11 మంది చిన్నారులు మృతి.. డాక్టర్ అరెస్ట్..
X
కోల్డ్రిఫ్ సిరప్‌లో ప్రమాదకరమైన రసాయనం గుర్తింపు

మధ్యప్రదేశ్‌లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారులకు వివాదాస్పద 'కోల్డ్రిఫ్' సిరప్‌ను సూచించిన ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ సోనీని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.

ఛింద్వారా జిల్లాలోని పరాసియా ప్రాంతంలో చాలా మంది చిన్నారులు డాక్టర్ ప్రవీణ్ సోనీ వద్ద చికిత్స తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యుడైన ఆయన తన ప్రైవేట్ క్లినిక్‌కు వచ్చిన చిన్నారులకు ఈ సిరప్‌ను సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిరప్ వాడిన తర్వాత చిన్నారుల ఆరోగ్యం విషమించి మరణించడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఈ దగ్గు మందును తయారు చేసిన తమిళనాడు కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కోల్డ్రిఫ్ సిరప్‌పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో జరిపిన పరీక్షల్లో ఈ సిరప్ శాంపిల్స్‌లో 48.6 శాతం డైఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మందు ‘ప్రామాణిక నాణ్యతతో లేదని’ తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా 'నెక్స్‌ట్రో-డీఎస్' అనే మరో సిరప్‌ అమ్మకాలను కూడా స్థానిక యంత్రాంగం నిలిపివేసింది.

బాధిత కుటుంబాల కథనం ప్రకారం సెప్టెంబర్ ఆరంభంలో చిన్నారులకు జలుబు, జ్వరం రావడంతో వారికి దగ్గు మందు ఇచ్చారు. మొదట కోలుకున్నట్లు కనిపించినా, కొద్ది రోజులకే లక్షణాలు తిరగబెట్టాయి. ఆ తర్వాత హఠాత్తుగా మూత్ర విసర్జన పూర్తిగా తగ్గిపోయి, కిడ్నీ సమస్యలు తలెత్తి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ బయాప్సీ పరీక్షల్లో డైఇథిలీన్ గ్లైకాల్ ఆనవాళ్లు కనిపించడంతో కల్తీ మందే కారణమని నిర్ధారణ అయింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘చిన్నారుల మరణాలు అత్యంత విషాదకరం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సిరప్‌తో పాటు దాని తయారీ కంపెనీకి చెందిన ఇతర ఉత్పత్తుల అమ్మకాలపై కూడా నిషేధం విధిస్తున్నాం. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు’’ అని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా కోల్డ్రిఫ్ సిరప్‌ను నిషేధించాయి.

Tags

Next Story