PM Modi : రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ విమానాశ్రయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌ను గుర్తుచేసుకుంటూ.. ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. కానీ.. దేశ ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం పొందేందుకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ వాటిని పాటించలేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com