Kangana Ranaut : సారీ చెప్పు.. లేదంటే.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి.. ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమరిస్తున్నాయని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ‘‘కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఆమెకు పెద్దగా జ్ఞానం లేదని ఆమె వ్యాఖ్యల్లోనే తెలుస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి, ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని చెప్పడం కంటే తెలివితక్కువ ప్రకటన మరొకటి ఉండదు. కనీసం ఒక్క రూపాయి దారి మళ్లించినట్లు నిరూపించాలి. లేదా ఇటువంటి నిరాధారమైన, అనవసరమైన ఆరోపణలు చేసినందుకు సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేదంటే కంగనాపై పరువునష్టం దావా వేస్తాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ సవాల్ విసిరారు. మండీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి, ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని ఆరోపించారు. ఆ డబ్బులతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ ధారాళంగా ఖర్చుపెడుతోందని ఆక్షేపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com