Next Vice President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..

Next Vice President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..
X
ప్రముఖంగా జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు

జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్‌ఖర్ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజీనామా చేయడం విమర్శలకు తావిస్తోంది. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే ధన్‌ఖర్ రాజీనామా చేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. ధన్‌ఖర్ వారసుడి కోసం వేట మొదలైంది. ఈ పోటీలో సీనియర్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, అనుభవజ్ఞులైన పార్టీ నాయకులు ఉన్నారు. అయితే త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నేతకే ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు హరివంశ్‌ను ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోబెడితే ప్రయోజనం చేకూరుతుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక ఉపరాష్ట్రపతి స్థానంలో ఆయన్నే కూర్చోబెడితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు నితీష్ కుమార్ కూడా ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి పదవిని బీహార్ నేతకు అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story