Kanwar Yatra : కన్వర్ యాత్ర కండిషన్లపై యూపీలో రచ్చ

ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న 'కన్వర్ యాత్ర' వివాదాస్పదంగా మారింది. కన్వారియాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యాత్ర సాగే దారి పొడవునా వారణాసి మున్సిపల్ అధికారులు కొన్ని కండిషన్లు పెట్టారు. శ్రావణ శివరాత్రి అనేది హిందువులకు పవిత్రమైన పండగ. ఈ నెలలో శివుడికి దేశవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ప్రసిద్ధి చెందింది. భక్తులు గంగా జలాన్ని తీసుకువచ్చి శివరాత్రి రోజున శివుడికి సమర్పిస్తారు. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాలు, ఇతర దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని ఇటీవల ముజఫర్ నగర్ జిల్లా పోలీసులు ఆదేశించారు. ఈ ఆదేశాలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇది వర్ణ వివక్ష, హిట్లర్ నాజీ రూల్స్ అంటూ మండిపడుతున్నాయి.
ఈ నిబంధనలు రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఓ వైపు ఈ వివాదం సాగుతుంటే, వారణాసి అధికారులు కన్వర్ యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీసులు శ్రావణ శివరాత్రికి సన్నాహాలు పూర్తి చేశారు. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్, కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న అన్ని మాంసం దుకాణాలు, ఫౌల్ట్రీ దుకాణాలను శ్రావణ మాసంలో మూసేయాలని ఆర్డర్ జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు యాత్రా మార్గంలో దుకాణదారులు తమ పేర్లను ప్రదర్శించాలని కోరిన తర్వాత తాజాగా వారణాసి అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com