CBI : సీబీఐ కస్టడీకి ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ .. అనుమతినిచ్చిన కోర్టు
బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ,ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడింది. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేయగా.. మంగళవారం కోర్టు 8 రోజుల కస్టడీకి అప్పగించింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సోమవారం అరెస్టు చేసింది. ఆస్పత్రి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. గత నెల 9న చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై ఘోష్‌ను సీబీఐ 15 రోజుల పాటు ప్రశ్నించింది. సోమవారం విచారణ అనంతరం ఆయనను ఇక్కడి ఏసీబీ ఆఫీసుకు తరలించి అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో ఇంతకు ముందు పోలీస్ పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ని అరెస్టు చేయగా ఇప్పుడిది రెండో అరెస్టు. అనాథ శవాలను అమ్ముకోవడంతోపాటు ఆసుపత్రి టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఘోష్‌పై ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారాల గురించి జూనియర్ డాక్టర్ కు తెలిసినందుకే ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com