Covid Cases: వేల నుండి లక్షలకు చేరిన కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ వైపే అన్ని రాష్ట్రాల చూపు..

Covid Cases: వేల నుండి లక్షలకు చేరిన కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ వైపే అన్ని రాష్ట్రాల చూపు..
Covid Cases: కొద్దిరోజులక్రితం వరకు పది, ఇరవై వేల మాత్రమే నమోదయ్యే కేసుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోరావడం ఆందోళన కల్గిస్తోంది

Covid Cases: భారత్‌లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొద్దిరోజులక్రితం వరకు పది, ఇరవై వేల మాత్రమే నమోదయ్యే కేసుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోరావడం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కొత్తగా లక్షా 68వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరింది. మహమ్మారితో 277మంది మృతిచెందారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉంది. అటు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4,461కి పెరిగాయి.

చాలా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఈ వేరియంట్‌వే ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 21వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు మేఘాలయ ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాష్ట్రంలోకి రావాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరిచేసింది. మహారాష్ట్రలో కొత్తగా 34వేల 424 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

యాక్టివ్​ కేసుల సంఖ్య 2లక్షల21వేల 477గా ఉన్నాయి. ముంబయిలోనే 11,వేల 647 కేసులు వెలుగు చూశాయి. అదే రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 1వేయి281కు చేరింది. వీటితోపాటు బంగాల్​లోను భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 21వేల 98 మందికి వైరస్​సోకగా.. 19 మంది మృతిచెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1 లక్ష 2 వేల 236కు చేరింది. కర్ణాటకలో 14వేలకు పైగా కొవిడ్​ కేసులు బయటపడ్డాయి.

ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యూపీలో 11వేల పైగా కేసులు వెలుగుచూశాయి. ఇక కేరళలో కూడా కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కొత్తగా 9,066 కేసులు వచ్చాయి. 19 మంది మరణించారు. 44వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ మరణాల సంఖ్య 50వేలు దాటాయి. ఇక రాజస్థాన్​లో6వేల 366 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలో 5వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.

ఝార్ఖండ్​లో కొత్తగా 4వేలు మందికి వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో 15-18 ఏళ్ల వారికి టీకాల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోను వైరస్ విస్తృతి కొనసాగుతోంది. తెలంగాణాలో కొత్తగా 1920 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 97వేలకు చేరింది. ఒక్కరోజులో వైరస్‌తో ఇద్దరు మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇక ఏపీలో నిన్నటితో పోలిస్తే కేసలు దాదాపు రెట్టింపయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Tags

Next Story