Crocodile : మహారాష్ట్రలో భారీ వర్షాలు, రోడ్డుపైకి మొసలి

రెండు రోజుల నుంచి దంచి కొడుతున్న వాన‌లు

మ‌హారాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజుల నుంచి వాన‌లు దంచికొడుతున్నాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వాగులు, వంక‌లు, చెరువులు, న‌దులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొస‌ళ్లు రోడ్ల‌పై ద‌ర్శ‌న‌మిస్తూ, వాహ‌న‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి జిల్లాలో భారీ వ‌ర్షం కురియ‌డంతో.. ఓ మొస‌లి న‌డిరోడ్డుపై ప్ర‌త్య‌క్ష‌మైంది. అయితే ఈ మొస‌లి స్థానికంగా ఉన్న శివ న‌దిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వాహ‌న‌దారులు, పోలీసులు పేర్కొన్నారు. శివ న‌ది మొస‌ళ్ల‌కు నిలయంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ద ఉధృతికి మొస‌లి రోడ్డుపైకి వ‌చ్చి ఉండొచ్చ‌ని చెప్పారు.

ఇక న‌డిరోడ్డుపై హ‌ల్‌చ‌ల్ సృష్టించిన మొస‌లిని వాహన‌దారులు త‌మ కెమెరాల్లో బంధించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రోడ్డుపై ప్ర‌త్య‌క్ష‌మైన మొస‌లి.. నోరు పెద్ద‌గా తెరుస్తూ ఆహారం కోసం గాలించింది. మ‌రో రెండు రోజుల పాటు ర‌త్న‌గిరి జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. పీటీఐ రిపోర్టు ప్రకారం.. మొసలి సమీపంలోని శివ లేదా వశిష్టి నదుల నుండి పట్టణంలోకి ప్రవేశించి ఉండవచ్చు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Tags

Next Story