Tamil Nadu : వాయుగుండం ప్రభావం.. తమిళనాడులో కుండపోత
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కడలూరు, నాగపట్టణం, ఎన్నూర్, కాట్టుప్పళ్లి, పుదుచ్చేరి, కారైక్కల్, పాంబన్, తూత్తుక్కుడి తదితర హార్బర్లలో మూడో నెంబరు ప్రమాద సూచిక ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్త చర్యలుగా తిరువళ్లూరు, విళుపురం, తంజావూరు, తిరువారూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరుచ్చి, రామనాథపురం తదితర జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలకు సెలవు ఇచ్చారు. వాయుగండం కారణంగా చెన్నైలో సముద్రం కల్లోలంగా కనిపించింది. ముఖ్యంగా ఎన్నూర్, తిరువొత్తియూర్, కాశిమేడు తదితర ప్రాంతాల్లో అలలు ఎగసిపడ్డాయి. చెన్నైలో 29న భారీవర్షం, 30న అతిభారీవర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా 12 విపత్తు నిర్వహణ బృందాలు బాధిత ప్రజలను కాపాడేందుకు రెడీ అయ్యాయి. చెన్నైలోని 12 పోలీసు డిప్యూటీ కమిషనర్ కార్యాయాలకు ఒక బృందం చొప్పున 12 బృందాలను ఏర్పాటు చేశారు. చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించేలా యంత్రాలు ఉన్నాయి. చెన్నై వ్యాప్తంగా 18 వేల మంది పోలీసులు సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారు. మహానగరంలో 35 కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com