Maharastra: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆగని మరణాలు

మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం గత మూడు రోజుల్లో వివిధ జిల్లాల్లో మొత్తం 78 మంది చనిపోగా, ఇందులో 30 వరకు నవజాత శిశు మరణాలున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వ ఏక్‌నాథ్ షిండే సర్కార్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ చతికిలపడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆసుపత్రి పరిసరాల్లో మరీ అనారోగ్యకర పరిస్థితులు ఇందుకు కారణం అంటున్నాయి.
ఆసుపత్రుల్లో మరణాలు అంటే సహజమే. ప్రతి రోజూ ఒకటి రెండు మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని 2ఆసుపత్రుల్లో ఈ మరణాలు అసాధారణ స్థాయిలో సంభవిస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 24 మంది చనిపోయిన ఘటన సోమవారం వెలుగులోకి రాగా, మరో ఏడుగురు చనిపోయినట్లు మంగళవారం తెలిసింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 24గంటల వ్యవధిలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో నలుగురు ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే చనిపోయినట్లు వెల్లడించారు. తాజాగా నాగపూర్‌లో 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీఎంసీహెచ్ లో 16 మంది, ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో మరో 9 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే 1900 పడకల జీఎంసీహెచ్ లో రోజూ సగటున 10 నుంచి 12 మంది రోగులు ప్రాణాలు కోల్పోతారని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.
ఆకస్మిక మరణాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సేవల కమిషనర్ నేతృత్వంలోని ఈ కమిటీ....వైద్యపరమైన కారణాలపై కూడా ఆరా తీయనుంది. చికిత్స అందించిన తీరుపై దర్యాప్తు చేయడం సహా చనిపోయిన వారి బంధువుల స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేయనుంది. కొందరు బంధువులు వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స అందించారని ఆరోపించారు. ఇప్పటికే థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితిపై ఆరా తీయడానికి అధికారుల బృందం పంపించింది. భారీ స్థాయిలో మరణాల నేపథ్యంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మరణాలపై బాంబే హైకోర్టు స్పందించింది. నాందేడ్, ఔరంగాబాద్ దవాఖానల్లో రోగుల మరణాలపై సుమోటాగా కేసు నమోదుచేసి విచారణ చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యంపై బడ్జెట్ వివరాల్ని శుక్రవారం లోగా కోర్టుకు సమర్పించాలని ఏక్‌నాథ్ షిండే సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com