Arvind Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal's).. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీ వాళ్లు మనపై ఎలాంటి కుట్రలైనా పన్నుతారు. కానీ.. నేను భయపడకుండా, వారికి లొంగకుండా గట్టిగా నిలబడ్డాను. నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు. బీజేపీలో చేరితే నాపై ఏ కేసులు లేకుండా వదిలేస్తారని చెప్తున్నారు. కానీ నేను బీజేపీలోకి ఎప్పటికీ వెళ్లనని తెగేసి చెప్పాను. నేను బతికి ఉండగా అది జరగని పని’’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్‌లో 40 శాతం ఖర్చు పాఠశాలలు, ఆసుపత్రులపై కేటాయిస్తోందని.. కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ బడ్జెట్‌లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈరోజు ఏజెన్సీలన్నీ మన వెంటే ఉన్నాయన్న ఆయన.. మనీస్ సిసోడియా, సత్యంద్ర జైన్ చేసిన తప్పులు పాఠశాలలను, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించడమేనని అన్నారు. ఒకవేళ మనీష్ సిసోడియా పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోయి ఉంటే, ఆయన అరెస్ట్ అయ్యుండేవాడు కాదన్నారు. వాళ్లు అన్ని రకాల కుట్రలు సృష్టించారని, కానీ తమని మాత్రం అడ్డుకోలేకపోయారని తెగేసి చెప్పారు. తనపై ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటే చాలని.. ఇంకేమీ కోరుకోవడం లేదని తెలిపారు.
ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఫిరాయింపులకు ప్రోత్సహించారంటూ చేసిన ఆరోపణలపై పోలీసులు కేజ్రీవాల్‌కు, మంత్రి ఆతిశీకి నోటీసులు ఇచ్చారు. ఎ ఆమెకు నోటీసులు అందించిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలలో ఏడుగురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ పేర్కొంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌కి కూడా నోటీసులు అందాయి. శనివారం ఐదు గంటల డ్రామా తర్వాత ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ముఖ్యమంత్రికి నోటీసును అందజేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com