Delhi : రేపు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. వచ్చే వీఐపీలు వీళ్లే

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాతి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, కొత్త సీఎం ప్రమాణ స్వీకార వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తోంది. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సినీ తారలు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు పంపింది. ఫిబ్రవరి 20 సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం జరగనుంది. దీనికి రామ్ లీలా మైదాన్ వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో కళాకారుల సాంస్కృ తిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్య మంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు మెగా వేడుకలో పాల్గొనబోతున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఢిల్లీ రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్రశాస్త్రి తదితర ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా వస్తారని కాషాయపార్టీ నేతలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com