Delhi CM : నేడు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడి రామ్‌లీలా మైదాన్‌లో బీజేపీ అట్టహాసంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్‌తో మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. 50మందికి పైగా సినీతారలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారని అంచనా. సీఎంతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించే అరుదైన గౌరవాన్ని రేఖా గుప్తా సొంతం చేసుకున్నారు. ఆమె 1974లో హరియాణాలోని జులానాలో జన్మించారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో ABVPలో చేరారు. అప్పటినుంచి రేఖ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా, 1996-97లో అధ్యక్షురాలిగా పనిచేశారు. RSS తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com