Delhi: వరద గుప్పిట రాజధాని..నీట మునిగిన రోడ్లు..
దేశ రాజధాని ఢిల్లీ వరద గుప్పిట చిక్కుకుంది. హస్తినతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తింది. దీంతో నదిలో నీరు ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అటు హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో యమునా నదిలో నీటి మట్టం ఆల్‌టైం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి.
వరద ఎర్ర కోటను కూడా తాకింది. దీంతో ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. అదేవిధంగా రాజ్‌ఘాట్ నుంచి కశ్మీర్ గేట్ వరకు వెళ్లే రహదారి జలమయమైంది. కనుచూపు మేర వరద తప్ప రోడ్డు కనిపించడం లేదు. అయితే ఎర్రకోటను కూడా వరద నీళ్లు తాకడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
యమునా నదిలో వరద నీరు ఢిల్లీకి మాత్రమే కాకుండా నోయిడా, గ్రేటర్ నోయిడాలోకి ప్రవేశించింది. దీంతో ఢిల్లీలోని పలు రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు యమునపై మెట్రో రైలు స్పీడ్‌ను కూడా తగ్గించారు. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో సింగు, బదర్‌పూర్, లోని, చిల్లా సరిహద్దుల నుంచి వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు.
భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఇక యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com