Digital Arrest Scam: 78 ఏళ్లవ్యక్తిని ట్రాప్ చేసి రూ. 23 కోట్లు కొట్టేశారు..

Digital Arrest Scam: 78 ఏళ్లవ్యక్తిని  ట్రాప్ చేసి రూ. 23 కోట్లు కొట్టేశారు..
X
బెదిరింపులతో వృద్ధున్ని నెల రోజులు డిజిటల్ అరెస్ట్

సైబర్ క్రిమినల్స్ వలలో పడితే అంతే. మాటలతోనే భయపెడతారు. పోలీసులమని లేదా ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెప్పి.. అందినకాడికి దోచేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలా సైబర్ ముఠాకు చిక్కిన ఓ వృద్ధుడు ఏకంగా 23 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. అంతేకాదు వృద్ధున్ని నెల రోజులు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ బెదిరించారు. అంతా అయిపోయాక మోసపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు వృద్ధుడు. డిజిటల్ అరెస్ట్.. ఈ పేరుతో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఇలాగే ఢిల్లీలో 78 ఏళ్ల నరేష్ మల్హోత్రా అనే బ్యాంకు మాజీ ఉద్యోగిని ఏకంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నెల రోజులపాటు ఇంటికే పరిమితం చేశారు. అంతే కాదు ఆయన వద్ద నుంచి క్రమక్రమంగా 23 కోట్ల రూపాయలు కొట్టేశారు.

సైబర్ నేరగాళ్లు ముందుగా ఉద్యోగి అక్రమంగా కూడబెట్టిన 2 కోట్ల 67 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత అసలు కథ షురూ చేశారు. అవినీతికి పాల్పడ్డావని.. అందుకే ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. కోట్లలో దోచుకున్నందుకు డిజిటల్ అరెస్టు అయ్యారని.. తాము చెబితే తప్ప బయటకు వెళ్లేది లేదని హెచ్చరించారు. తమకు సహకరించాలని.. రికవరీ చేస్తున్నట్లుగా నమ్మించారు.. సౌత్ ఢిల్లీ గుల్‌మార్గ్ పార్క్ ఏరియాకు చెందిన నరేష్ మల్హోత్రాకు.. ఆగస్టు 01 న మొబైల్ కనెక్షన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. ఆధార్ కార్డును టెర్రర్ ఫండ్ రైజింగ్ కోసం వినియోగించారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ విషయంలో ముంబై పోలీసులతో మాట్లాడాలని.. వాళ్లు అప్రూవ్ చేస్తే ఫోన్ కనెక్షన్ ఉంటుందని.. లేదంటే కనెక్షన్ కట్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చినట్లు మల్హోత్రా చెప్పాడు. కొందరు ముంబై పోలీసులమని.. మరి కొందరు ఈడీ, సీబీఐ ఆఫీసర్లుగా ఫోన్ చేసి.. చట్టపరంగా ముప్పు ఉన్నట్లు బెదిరించారు. ఆధార్ కార్డును టెర్రర్ ఫండింగ్ కోసం.. ఇతర సీరియస్ నేరాల కోసం వినియోగించినట్లు భయపెట్టారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని.. పాస్ పోర్టు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని అన్నారు. ప్రతి 2 గంటలకు వీడియో కాల్ అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సెటప్ చేసి అధికారులుగా నమ్మించారు..

ఆ విధంగా బెదిరించి.. బ్యాంకు అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పాలని.. టెర్రర్ ఫండ్ జరిగినందుకు అకౌంట్ సీజ్ చేస్తామని బెదిరించారు. 14 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పడంతో.. వెరిఫికేషన్ పర్పస్‌లో తమ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఆగస్టు 01 నుంచి సెప్టెంబర్ 04 మధ్యలో మొత్తం 23 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 4 వేల అకౌంట్లకు డబ్బు పంపించి.. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విత్ డ్రా చేసుకున్నారు. ప్రతి ట్రాన్స్‌ఫర్ తర్వాత లావాదేవీల గురించి ఫేక్ RBI సర్టిఫికేట్ ను బాధితునికి దుండగులు పంపించారు.. మరోవైపు 23 కోట్ల రూపాయలు దోచేసినా.. సైబర్ క్రిమినల్స్ ధనదాహం తీరలేదు. మ్యూచువల్ ఫండ్స్, SIP తదితర పెట్టుబడుల గురించి తెలుసుకున్నారు. బాంబే హైకోర్టు నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. మొత్తం సంపదలో 25 శాతం ముందుగా వెరిఫై చేస్తామని.. ఆతర్వాత నిబంధనల ప్రకారం తర్వాత వెరిఫై చేస్తామని నమ్మించారు. కుటుంబ సభ్యులను కూడా టెర్రర్ సంస్థలతో సంబంధాలున్న ముఠాగా గుర్తిస్తామని బెదిరించారు. దుండగుల బెదిరింపుతో 3 బ్యాంకుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్న మొత్తాన్ని లిక్విడేట్ చేసుకుని.. నిందితులకు ట్రాన్స్ ఫర్ చేశాడు మల్హోత్రా.

చివరికి సెప్టెంబర్ 14న సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేరున మిగిలిన రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా చెప్పారు. దీంతో వాళ్లు చెప్పిన వెస్ట్ బెంగాల్ కు చెందిన బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ కేసు ఫైనల్ స్టెప్‌లో ఉందని.. సుప్రీం కోర్టు మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. అయితే మిగిలిన అమౌంట్ కూడా డిపాజిట్ చేయాలని చెప్పగా.. డైరెక్టుగా సుప్రీం కోర్టు లోనే డిపాజిట్ చేస్తానని.. హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని చెప్పడంతో దుండగులు ఫోన్ చేయడం ఆపేసినట్లు చెప్పాడు మల్హోత్రా. తను మోసానికి గురైనట్లు సెప్టెంబర్ 19న గ్రహించానని.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి.. 23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.. ఢిల్లీ సైబర్ నేరాలను చూసే ఇంటలిజెన్స్ ఫ్యుజన్, స్ట్రాటజిక్ ఆపరేషన్ IFSO యూనిట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.. నా జీవితంలో ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ కోసం కష్టపడి దాచుకున్న డబ్బు.. ఒక్క నెలలో మాయం అయ్యింది.. నేను తప్పుడు వ్యక్తులను నమ్మాను.. నా కథ అందరికీ వార్నింగ్ కావాలని పోలీసుల ముందు భావోద్వేగానికి గురయ్యాడు మల్హోత్రా.

Tags

Next Story