Baba Siddique: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ బాంద్రాలోని తన కుమారుడు జీషన్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. అయితే సిద్ధిఖీ హత్య వెనుకాల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహిత సంబంధాలు కొనసాగించడం కారణంగానే బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ తమకు టార్గెట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహితంగా ఉండడమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు తమ శత్రువు అని పేర్కొన్నారు. రోహిత్ స్టేట్‌మెంట్ సిద్దిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చనే బలాన్ని చేకూరుస్తుంది. తనకు ప్రాణహాని ఉందని, తనకు వై కేటగిరీ భద్రత కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులను 15 రోజుల క్రితం కోరినట్లు సిద్ధిఖీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్‌ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్‌లో ఉండగా, రెండోసారి పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.
ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్‌కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్‌తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్‌తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్ బిష్ణోయ్‌కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com