Gas Supply : ఫ్యాక్టరీలకు కట్..వంటగదికి ఫుల్..దేశంలో అమల్లోకి వచ్చిన గ్యాస్ రెగ్యులేషన్ ఆర్డర్ 2026.

Gas Supply : ఫ్యాక్టరీలకు కట్..వంటగదికి ఫుల్..దేశంలో అమల్లోకి వచ్చిన గ్యాస్ రెగ్యులేషన్ ఆర్డర్ 2026.
X

Gas Supply : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తుంటే, భారత ప్రభుత్వం మాత్రం సామాన్యుడి వంటగదికి రక్షణ కవచంలా నిలుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తాజాగా నేచురల్ గ్యాస్ (సప్లై రెగ్యులేషన్) ఆర్డర్, 2026ను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పారిశ్రామిక అవసరాల కంటే ఇళ్లలో వాడే పైప్డ్ నేచురల్ గ్యాస్, వాహనాలకు వాడే సిఎన్జికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, ఫ్యాక్టరీలకు గ్యాస్ తగ్గించినా సరే, సామాన్యుడి పొయ్యి వెలగాల్సిందేనని మోదీ సర్కార్ గట్టి నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు జరుగుతుండటంతో సముద్ర మార్గాల్లో గ్యాస్ రవాణా ప్రమాదంలో పడింది. భారత్ తన అవసరాలకు కావాల్సిన గ్యాస్‌లో సగానికి పైగా ఈ మార్గాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ సరఫరాదారులు ఫోర్స్ మెజ్యూర్(అనివార్య కారణాలు) సాకుతో సరఫరాను నిలిపివేస్తుండటంతో దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955ను ప్రయోగించింది. దీని ద్వారా పెట్రోకెమికల్ ప్లాంట్లు మరియు రిఫైనరీలకు వెళ్లాల్సిన గ్యాస్‌ను మళ్లించి, నేరుగా గృహ వినియోగదారులకు అందజేయనున్నారు.

ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. గత ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా గృహాలకు 100 శాతం గ్యాస్ సరఫరాను కంపెనీలు గ్యారెంటీ ఇవ్వాలి. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌లో గ్యాస్ అందుబాటులో ఉన్నంత వరకు, మొదటి హక్కు సామాన్యుడిదే. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ పూల్డ్ ప్రైస్ సిస్టమ్‌ను పర్యవేక్షిస్తుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దేశంలోని సామాన్యులపై ఆ భారం పడకుండా తక్కువ ధరకే గ్యాస్ అందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ ఉండి బిల్లులు చెల్లించని వారిపై మాత్రం కఠినంగా ఉండాలని, అవసరమైతే వారి కనెక్షన్లు కట్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి.

మరోవైపు, పారిశ్రామిక రంగానికి మాత్రం గ్యాస్ సెగ గట్టిగానే తగిలేలా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ వంటి కంపెనీలు ఇప్పటికే పారిశ్రామిక వినియోగదారులకు సరఫరాను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. చాలా ఫ్యాక్టరీలకు ఇప్పుడు వారి సగటు వినియోగంలో కేవలం 80 శాతం మాత్రమే గ్యాస్ అందుతోంది. పరిశ్రమల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయం వస్తున్నప్పటికీ, యుద్ధ సమయంలో ప్రజల ప్రాథమిక అవసరాలకే మొగ్గు చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల కొన్ని ఉత్పాదక రంగాల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, వంట గ్యాస్ కొరత రాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

Tags

Next Story