Sharad Pawar: రాజకీయాలకు పవార్ గుడ్‌బై!

భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-ఎస్పీ అధినేత శరద్ పవార్ (83) తెలిపారు. తాను ఇప్పటికే 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు. అలాగే, తన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం పూర్తయిన తర్వాత పార్లమెంటరీ పదవి నుంచి వైదొలగాలా? అన్న విషయంపై ఆలోచిస్తానని తెలిపారు. దీంతో ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి.
తన మనవడు యుగేంద్ర పవార్ తరఫున బారామతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శరద్ పవార్ ఈ సందర్భంగా మాట్లాడారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలంటే అసలు తాను ఏ ఎన్నికల్లోనూ గెలవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, ఎంపీ పదవీకాలం ఒకటిన్నర సంవత్సరాలు మిగిలి ఉందని వివరించారు.
ఇప్పటికే 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తాను.. ఇంకా ఎన్ని ఎన్నికల్లో పోటీచేయాలని శరద్ పవార్ ప్రశ్నించారు. ఆ అవసరం లేదని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. తాను సామాజిక సేవలో పాల్గొంటూనే ఉంటానని, ముఖ్యంగా వెనుకబడిన, ఆదివాసీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. కాగా, శరద్ పవార్ రాజ్యసభ పదవీ కాలం 2026లో ముగుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com