EC: నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్
దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఈ రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈసీ ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, ఈసీ కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించి, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లను పక్కనబెట్టింది.
మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ-శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమికి కాంగ్రెస్-శివసేన (ఠాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) పార్టీలో కూడిన మహావికాస్ అఘాడీ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 145. .. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 26తోనూ గడువు ముగియనుంది. దీంతో గడువులోగా ఎన్నికలు పూర్తిచేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మహాయుతి సర్కారు చేపట్టింది. అలాగే, గతవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఓబీసీలకు క్రిమీలేయర్ పరిమితి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలు పెంచడం, ఎస్సీ కమిషన్ చట్టబద్దత వంటి నిర్ణయాలు తీసుకుంది.
అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి మహారాష్ట్రాలోని మొత్తం 48 సీట్లకు గానూ 30 చోట్ల విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మహాయుతికి ఊహించని ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ దారుణంగా చతికిలబడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి, అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ పార్టీ 158 సీట్లలోనూ.. షిండే సేన 70, అజిత్ పవర్ ఎన్సీపీ 50 సీట్లలో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కానీ, ఈ విషయంలో కూటమిలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అంతేకాదు, అవసరమైతే అజిత్ పవార్‌ను కూడా వదిలించుకోడానికి సిద్ధమైనట్టు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com