Sharad Pawar: శరద్ పవార్ పార్టీ పేరు ఏంటంటే

Sharad Pawar: శరద్ పవార్ పార్టీ పేరు ఏంటంటే
అజిత్ పవార్‌దే ఎన్సీపీ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేరు ఇచ్చింది. ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’గా ఆయన పార్టీకి పేరు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ వర్గం మొత్తం మూడు పేర్లను ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్సీపీ శరద్ పవార్, ఎన్సీపీ శరద్చంద్ర పవార్, ఎన్సీపీ శరద్రావు పవార్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరింది. అలాగే, ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Maharashtra Deputy CM Ajit Pawar) వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. ఎన్సీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అజిత్ పవార్‌కు మాత్రమే ఉందని ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీపీ పేరును, అధికార గుర్తు గడియారాన్ని కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల (RajyaSabha Elections) దృష్ట్యా శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. శరద్ పవార్ గ్రూపు ఇప్పుడు కొత్త గుర్తు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని తెలిపింది.

కొన్ని నెలల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ ఇస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) మంత్రివర్గంలో అజిత్ పవార్ చేరారు. ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ సర్కారుకి మద్దతు తెలుపుతోందని అజిత్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీ గుర్తు మీదే భవిష్యత్తులోనూ పోటీ చేస్తామని అంటున్నారు. చివరకు ఆయన వర్గానికే గడియారం గుర్తు దక్కింది.

కాగా, శరద్‌ పవార్‌ సోదరుడి కుమారుడే అజిత్‌ పవార్. అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, తన వర్గం నేతలతో కలిసి మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అనంతరం అజిత్‌ పవార్‌‭ను ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్‌ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గానికి కొత్త పేరు ఇచ్చింది ఈసీ.

Tags

Read MoreRead Less
Next Story