సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు

అధికార పార్టీ నేతలపై ఈడీ అధికారులు దాడులతో తమిళనాడులు రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్‌పై సీఎం స్టాలిన్‌తో పాటు విపక్ష నేతలు సైతం భగ్గుమంటున్నారు. విపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని స్టాలిన్ హెచ్చరించారు.మనీలాండరింగ్ కేసులో అరెస్టైన వెంటనే అస్వస్థతకు గురై, చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సెంథిల్ బాలాజీని స్టాలిన్ పరామర్శించారు. తమ నాయకులపై జరుగుతున్న దాడులపై న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు సైతం స్టాలిన్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతుందని,ఈడీ రైడ్స్‌తో తమకేంటి సంబంధం అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పు చేశారు కాబట్టే ఈడీ రైడ్స్‌కు వణికిపోతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఉద్యోగాల కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇకమంత్రి సెంథిల్ బాలాజీకి కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఆయనకు వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో తన భర్త సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని ఆయన భార్య మేఘల తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఇక సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం విపక్ష పార్టీల నేతలపై రాజకీయ బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు విపక్షాలు ఎన్నటికీ భయపడేది లేదని ఖర్గే తేల్చి చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com