Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ షాక్.. ముంబైలో ఉన్న రూ. 3,700 కోట్ల ఇల్లు జప్తు.

Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ షాక్.. ముంబైలో ఉన్న రూ. 3,700 కోట్ల ఇల్లు జప్తు.
X

Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పాలి హిల్‌లో ఉన్న ఆయన విలాసవంతమైన నివాసం అబోడ్‎ను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భవనం విలువ అక్షరాలా రూ.3,716.83 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. గతంలో కూడా అనిల్ అంబానీకి చెందిన దాదాపు రూ.473 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ కేసును విచారిస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ, ఇతరులపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం వంటి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. దేశీయ, విదేశీ బ్యాంకులకు సంబంధించిన వేల కోట్ల రూపాయల రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలు అనిల్ అంబానీపై ఉన్నాయి. బ్యాంకులకు ఆయన చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.40,185 కోట్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈడీ దర్యాప్తులో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. పాలి హిల్‌లో ఉన్న ఈ ఖరీదైన ఆస్తిని రైజై ట్రస్ట్ అనే ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ట్రస్ట్‌లో అనిల్ అంబానీ కుటుంబ సభ్యులే సభ్యులుగా ఉన్నారు. బ్యాంకులకు ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి, బ్యాంకుల రికవరీ చర్యల నుండి తన సొంత ఆస్తులను కాపాడుకోవడానికి అనిల్ అంబానీ ఈ తెలివైన ఎత్తుగడ వేశారని ఈడీ ఆరోపిస్తోంది.

అయితే, ఈ ఆస్తుల జప్తుపై అనిల్ అంబానీ గానీ లేదా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ, ఇప్పుడు తన సొంత ఇంటినే కోల్పోయే పరిస్థితి రావడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల నుంచి తీసుకున్న ప్రజా ధనాన్ని దారి మళ్లిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఈడీ ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.

Tags

Next Story