Exit Poll 2022: 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివిధ సంస్థలు

Exit Poll 2022: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతలుగా ఎన్నికలు జరగగా… మణిపూర్‌లో రెండు విడతలు, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఎన్నికల బరిలో హోరాహోరీగా తలపడ్డ పార్టీల భవితవ్యాన్ని ఓటర్లు.. ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఫలితాలు ఎవరికి అనుకూలంగా రానున్నాయన్న అంశంపై మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఒక్కసారి పరిశీలిస్తే…
ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఉత్తరప్రదేశ్‌లో కమలదళానికి ఘోర పరాభవం తప్పదని ఆత్మసాక్షి అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి 235 నుంచి 240 స్థానాలు దక్కనుండగా… బీజేపీకి కేవలం 138-140 సీట్లు మాత్రమే రానున్నాయి. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 19 నుంచి 23 స్థానాలు… కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 16 స్థానాలు… ఇతరులకు ఒకటి రెండు స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ అంచనా వేస్తోంది.
ఇక ఇదే సంస్థ పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీకి 58 నుంచి 61 స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది. ఇక ఆప్ కు 34 -38 సీట్లు, అకాలీదళ్ కూటమికి 18 నుంచి 21 స్థానాలు, బీజేపీ కూటమికి 4 నుంచి 5 స్థానాలు… ఇతరులకు ఒకటి రెండు స్థానాలు వస్తాయని సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది.
అటు ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి పరాభవం తప్పదని చెబుతోంది ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 20 నుంచి 21 స్థానాలు దక్కనుండగా… కాంగ్రెస్‌కు 43 నుంచి 47, ఆప్ కు 2 నుంచి 3, ఇతరులకు ఒకటి రెండు స్థానాలు దక్కవచ్చని చెబుతోంది.
గోవాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం ఖాయమని ఆత్మసాక్షి గ్రూప్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 21 నుంచి 22, బీజేపీకి 9 నుంచి 10 స్థానాలు, ఆప్ కు 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 5 నుంచి 6 స్థానాలు రావొచ్చని చెబుతోంది.
మరోవైపు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కమలనాథులకు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 220 నుంచి 240 స్థానాలు దక్కుతాయని చెబుతోంది. గతంతో పోల్చితే 90 స్థానాల వరకు నష్టపోయినా.. అధికారం మాత్రం దక్కడం ఖాయమని చెబుతోంది. ఇక సమాజ్‌వాదీ కూటమికి 148 నుంచి 172 స్థానాలు, బీఎస్పీ కి 12 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 10 స్థానాలు.. ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు రావొచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది.
ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడం ఖాయమంటోంది పీపుల్స్ పల్స్. ఆ పార్టీకి కేవలం 23 నుంచి 28 స్థానాలు… దక్కనుండగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి 59 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక అకాలీదళ్ కూటమికి 17 నుంచి 21 స్థానాలు, బీజేపీ కూటమికి కేవలం 2 నుంచి 6 స్థానాలు, ఇతరులకు నాలుగు వరకు స్థానాలు రావొచ్చని అంచనా వేసింది.
అటు ఉత్తరాఖండ్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీయే ఓ మెట్టు పైన ఉంటుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తరాఖండ్ లో బీజేపీకి 30 నుంచి 35 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్‌కు 32 నుంచి 37 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఆప్ పార్టీకి ఒక స్థానం వరకు.. ఇతరులకు రెండు స్థానాల వరకు రావొచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com