Vijayawada-Hyderabad Highway : ఆరు లేన్లుగా విజయవాడ- హైదరాబాద్ రహదారి విస్తరణ

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి అయిన ఎన్హెచ్ -65ను ఆరు లైన్ల రహదారిగా విస్తరించడంలో భాగంగా కీలక అడుగు పడింది. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న రహదారి మార్గాన్ని.. ఆరు లైన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. ఎన్హెచ్-65 ను ఆరు లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ గతేడాది టెండర్లను ఆహ్వానించగా.. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్లను 2025 జనవరి 20న తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో మార్చి నెలాఖరులోపు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఆరు నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్హెచ్-65 రోడ్డును హైదరాబాద్ అవతల.. అంటే దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com