FASTag Annual Pass : ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. 200 ట్రిప్పుల పాస్ అయిపోతే మళ్ళీ ఇలా యాక్టివేట్ చేసుకోండి.

FASTag Annual Pass : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టు 15, 2025న వాహనదారుల కోసం ఈ ప్రత్యేకమైన యాన్యువల్ పాస్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ పాస్ ధర రూ.3000. దీని ద్వారా ఒక సంవత్సర కాలంలో లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందైతే అది) మీరు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం సొంత వాహనాలు (Personal Cars, SUVs) ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.
200 ట్రిప్పులు అయిపోతే ఏం చేయాలి?
చాలామందికి వచ్చే ప్రధాన సందేహం.. ఒకవేళ ఏడాది పూర్తికాకముందే 200 ట్రిప్పులు వాడేస్తే పరిస్థితి ఏంటని? దీనికి పరిష్కారం సులభం. మీ ట్రిప్పులు ముగిసిన వెంటనే, మీరు మళ్ళీ కొత్తగా పాస్‌ను రీ-యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. యాప్‌లోకి వెళ్లి Add Pass ఆప్షన్ ద్వారా వాహన వివరాలు నమోదు చేసి, పేమెంట్ పూర్తి చేస్తే చాలు. నిమిషాల్లో మీ పాస్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది.
ట్రిప్పులు మిగిలిపోతే పరిస్థితి ఏంటి?
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నిబంధన ఉంది. ఒకవేళ ఏడాది పూర్తయ్యాక కూడా మీ 200 ట్రిప్పుల్లో కొన్ని మిగిలి ఉంటే, అవి వచ్చే ఏడాదికి బదిలీ (Carry Forward) కావు. సంవత్సరం ముగియగానే పాత పాస్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కాబట్టి వినియోగదారులు తమ ట్రిప్పులను ఏడాది లోపే వాడుకోవడం ఉత్తమం. లేదంటే ఆ ట్రిప్పులు వృథా అయిపోతాయి.
కొత్తగా పాస్ తీసుకోవడం ఎలా?
మీరు మొదటిసారి యాన్యువల్ పాస్ తీసుకోవాలనుకుంటే, ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే పని పూర్తి చేయవచ్చు. మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, వాలిడ్ ఫాస్టాగ్ ఐడీ వంటి వివరాలు ఇచ్చి రూ.3000 చెల్లిస్తే, కేవలం రెండు గంటల్లోనే మీ పాస్ పనిచేయడం మొదలవుతుంది. తరచూ హైవేలపై ప్రయాణించే వారికి, ముఖ్యంగా సిటీ శివార్లలో నివసించే వారికి ఇది నిజంగా వరమే అని చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
