Budget 2026: ఫిబ్రవరి 1న సండే..సస్పెన్స్‌లో బడ్జెట్ తేదీ..పార్లమెంట్‌లో ఇవాళే అసలు లెక్క తేలనుంది.

Budget 2026: ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీ రాగానే దేశం చూపు పార్లమెంట్ వైపు ఉంటుంది. కానీ ఈసారి అంటే బడ్జెట్ 2026 విషయంలో ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఆ రోజూ ఆదివారం కావడమే దీనికి కారణం. మరి సెలవు రోజైన ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెడతారా లేదా తేదీ మారుస్తారా అనే దానిపై తాజా అప్‌డేట్ తెలుసుకుందాం. దేశ ఆర్థిక స్థితిగతులను మార్చే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో తేదీ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఆదివారం పార్లమెంట్ కు సెలవు ఉంటుంది. కానీ బడ్జెట్ అనేది అత్యంత కీలకమైన అంశం కాబట్టి, ప్రభుత్వం ఆ రోజునే దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కీలక భేటీ నిర్వహించనుంది.
గతంలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సెలవు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెడితే, అది సామాన్యులకు ఒక విధంగా ప్లస్ పాయింట్ అవుతుంది. సెలవు రోజు కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇంట్లోనే కూర్చుని టీవీల్లో నిర్మలమ్మ ప్రసంగాన్ని ప్రశాంతంగా వినే అవకాశం ఉంటుంది. తమ జేబుకు ఎంత చిల్లు పడుతుంది, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు.
బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ గురించి అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 28వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జనవరి 29న దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని వివరించే ఎకనామిక్ సర్వే నివేదికను ప్రభుత్వం సభ ముందు ఉంచుతుంది. జనవరి 30, 31 తేదీల్లో విరామం ఉండే అవకాశం ఉంది.
ప్రభుత్వం గనుక తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఫిబ్రవరి 1 (ఆదివారం) నాడే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ బయటకు వస్తుంది. ఈ బడ్జెట్‌లో సామాన్యుల కోసం ఆదాయపు పన్ను రాయితీలు ఉంటాయా? లేదా ఇతర సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇవాళ జరగబోయే సమావేశం తర్వాత బడ్జెట్ తేదీపై పూర్తి స్పష్టత రానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

