Lok Sabha Elections: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

వచ్చే నెల 19న జరగనున్నతొలివిడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. నామినేషన్లు దాఖలు చేసే గడువు బుధవారం ముగియనుండగా, నిన్న దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నామపత్రాలు సమర్పించారు.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్.ఛింద్వాడ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఛింద్వాడలోని హనుమాన్ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. తర్వాత తండ్రి కమల్ నాథ్, తల్లి సమీమణితో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్.... ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. ఛింద్వాడ నుంచి నకుల్‌నాథ్ విజయం సాధించారు.
అసోంలోని దిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో కలిసి వెళ్లిన ఆయన, రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేశారు. భాజపా సిట్టింగ్ ఎంపీ ప్రదాన్ బారుహ్ లఖింపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. తొలి విడత ఎన్నికల్లో అసోంలో దిబ్రూగఢ్, లఖింపూర్, జోర్హాట్, కాజిరంగా, సోనిత్‌పూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో పలువురు మహిళలు సంప్రదాయ నృత్యం చేశారు. తమిళనాడులో తూత్తుకుడి DMK అభ్యర్థి కనిమొళి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరగనుంది.
మొదటి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీయే, ఇండియా కూటమిలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీయే తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ 102 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com