National News : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీని చంపేస్తా.. ఎఫ్ఐఆర్ ఫైల్

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఈ వ్యక్తిపై యాద్గిర్ జిల్లాలోని సూర్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ, యూపీ సీఎంపై దుర్భాషలు
యాదగిరి జిల్లా రంగంపేటకు చెందిన మహమ్మద్ రసూల్ కద్దరే అనే నిందితుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని, సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో చేతిలో పదునైన ఆయుధంతో నిందితుడు ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లను దుర్భాషలాడాడు. తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసిన రసూల్.. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అనరాని పదాలతో దూషించాడని పోలీసులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు
రసూల్ హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన సూర్పూర్ పోలీసులు మహ్మద్ రసూల్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 505(1)(బి), 25(1)(బి)తో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం సూర్పూర్ పోలీసులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com