Fire break out: భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 22 గోదాములు..!

మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీలో ఉన్న రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద సోమవారం ఉదయం (మే 12) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ అగ్నిప్రమాదం పలు కంపెనీల గోదాములను చుట్టుముట్టగా, దాదాపు 22 గోదాములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ గోదాముల్లో రసాయనాలు, ముద్రణ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ పౌడర్లు, కాస్మెటిక్ ఉత్పత్తులు, బట్టలు, షూస్, మండపం అలంకరణ సామగ్రి, ఫర్నిచర్ వంటి వస్తువులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. పెద్దెత్తున ఫైర్ ఇంజన్లు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక చర్యలు ప్రారంభించారు. భివండి, కల్యాణ్ నుండి నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా పొగ వడదట్టినట్టు కనిపిస్తోంది. ఘటనాస్థలంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో మొదట ఐదు కంపెనీల్లో మంటలు చెలరేగగా. తరువాత మండప అలంకరణ సామాగ్రి ఉన్న స్టోరేజ్ వరకు విస్తరించాయి. ఇలా మొత్తంగా మొత్తం 22 గోదాములు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రాణనష్ట సమాచారం అందలేదు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com