Heavy Rains: ఉత్తరాదిలో భారీ వరదలు

ఉత్తరాదిలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతతో నిలువెల్లా వణికిన హిమాచల్ ప్రదేశ్‌ను వరద కష్టాలు వీడటం లేదు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిల్ స్టేట్ తడిసిముద్దయింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 330 మంది మరణించారు.
కనీవినీ ఎరుగని జల ప్రళయంతో వెన్ను విరిగిన హిమాచల్ వరదలను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. భారీ వర్షాలతో జల విధ్వంసం నెలకొనడంతో హిమాచల్ ప్రదేశ్ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హిమాచల్ ప్రదేశ్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం రాష్ట్రం వేచిచూస్తుందని సీఎం తెలిపారు. వరదల్లో నష్టపోయిన బాధితుల కోసం సహాయ పునరావస కార్యక్రమాలు ఊపందుకున్నాయని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని సీఎం సుఖు తెలిపారు. ఇక గత వారం రోజులుగా హిమాచల్‌లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకర స్ధాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
తాజాగా పంజాబ్‌లోని ఓ వరద ప్రభావిత గ్రామంలో చిక్కుకున్న 300 మందిని గురువారం సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. భాక్రానంగల్, పాంగ్ డ్యామ్‌ల నుంచి దిగువకు నీటిని వదలడంతో పంజాబ్‌లోని 68 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రాజెక్టుల నుంచి నియంత్రిత పద్ధతిలోనే నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురుదాస్‌పూర్, అమృత్‌సర్, రోవర్, కపుర్తాలా, హోషియార్‌పూర్, తర్న్ తరణ్ జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, సైనిక బలగాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com