Champai Soren : కొత్త పార్టీ పెడతా .. జార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్ ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.‘నా ముందున్న మూడు అవకాశాలను ఇదివరకే చెప్పా. రిటైర్మెంట్ తీసుకోవడం, ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయడం లేదా స్నేహితుడిని వెతుక్కోవడం. కానీ, నేను ఇప్పుడే రిటైర్ అవ్వను. ఎంతోమంది నాకు మద్దతుగా ఉన్నారు. ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం. ఓ కొత్త పార్టీని ప్రారంభించి దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నా. నా ప్రయాణంలో ఎవరైనా మంచి మిత్రుడు కలిస్తే వారితో కలిసి ముందుకెళ్తా’అని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభిస్తాని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అధికార జేఎంఎంపై చంపయీ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని ఇటీవల ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com